అడుక్కునేవాన్ని ఆర్థిక శాఖా మంత్రిన
"పియ్యే!! పియ్యే!! యేడ పోయినవ్ వయా? బిఛ్ఛం నాయాల. ఎక్కడ అడుక్కతింటన్నవ్ రా? జల్దిన గీడకి రా!!" అరుస్తున్నారు ఆర్థిక శాఖామాత్యులు భిక్షపతి గారు. అయ్యగారి పియ్యే పేరు శ్రీనివాసులు. మన పియ్యే గారు భిక్షపతి కి పి.ఎ. గా జాయిన్ అయిన రోజు ఏమయ్యా! నీ పేరు ఏందయ్యా? అని భిక్షపతి అడిగితే "శ్రీనివాసులు" అని చెప్పాడు పి.ఎ.; వెంటనే మన అమాత్యులుంగారు "చీనిబాసులా?" అని అడగ్గానే పి.ఎ. మొహం బల్లి పడ్డ సాంబారు తిన్నట్టు అయిపోయింది. "సార్! పి.ఎ అని పిలవండి." అని వేడుకున్నాడు పి.ఎ.; " పియ్యే నా! ఇదేంది వయా! నీకు రెండు పేర్లా? అయినా పియ్యే ఏంది వయా? నా చిప్పలో నీ రూపాయి." అని పగలబడి నవ్వాడు మంత్రి భిక్షపతి. ఏది ఏమయితేనేం శ్రీనివాసులు- చీనిబాసులుగా మారి, చీనిబాసులు పియ్యేగా మారిపోయాడు. ఆ క్షణం నుండే పియ్యే పైకి నవుతూ, లోపల తిట్టడం మొదలెట్టాడు. మన మంత్రి గారి ఊతపదం చెప్పనక్కర్లేదు. నా చిప్పలో నీ రూపాయి. అవసరం ఉన్నా లేకున్నా వాడేస్తుంటాడు ఈ పదాన్ని. ఇక్కడ కట్ చేసి సీన్ లోకి వస్తే..
"కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగాడా? అలా అరుస్తున్నాడు" అని మనసులో అనుకుంటూ పియ్యే వచ్చాడు. "ఏంది వయ్యా! ఇయ్యాల పొద్గాల సంది ఊర్ల మీద పడి తిరుగుడన్నవ్? ఎలచ్చన్లు గిట్ల వస్తన్నయా?" అడిగాడు భిక్షపతి. బియ్యం ఎలుకలెత్తుకుపోతున్నాయని, ఎలుకలమందు బియ్యం లో కలుపేంత మేధావి!! వీడు-వీడు ఆర్థిక శాఖా మంత్రి.. అని మనసులో అనుకుంటూ, సిన్సియర్ గా మొహం పెట్టి, "కాదు సార్! పది గం|| లకు మహిళా మండలి వాళ్ళతో మీటింగ్, పదకొండు గంటలకు సి.ఎం. ను కలవాలి, పన్నెండు గంటలకు ప్రెస్ మీట్, మళ్ళీ రెండు గంటలకు ఎయిడ్స్ మహా సభల సమవేశం లో మీరు ప్రత్యేక అతిథిగా హాజరవ్వాలి, నాలుగు గంటలకు ప్రముఖ న్యూస్ చానల్ మీతో లైవ్ ప్రోగ్రాం చేస్తుంది." చెప్పాడు పియ్యే. "ఏందివయ్యా గివన్ని నాకేనా? సాయిబాబ గుడికాడ అడుక్కునే యాదన్న బెడ్డుకేసనల్ మనిస్టర్ అయ్యిండత. గవాడికి ఏం లెవ్వా? నా చిప్పలో నీరూపాయి!!" లుంగి పైకెత్తి అడిగాడు భిక్షపతి. "ఎడ్యుకేషనల్ మినిష్టర్ ని ఎంతా బాగా పలికాడు. నీగ్రోవాడికి ముల్తాని మట్టి రాస్తే! ఈ మేక్ అప్ నా ఫేస్ కు బాగా సూట్ అయింది కదా? అన్నాడంట.. వీడుకూడా అంతే. బారు ముందు బీరు మూతలు నాకే సన్నాసి. వీడి మొహానికి ఇంగ్లీష్ ఒకటి. లోపల గోచీ కనపడేలా ఎక్స్ పోజింగ్ ఒకటి." మనసులో తిట్టుకుంటూ చిన్న ఇస్మైల్ ఇచ్చాడు పియ్యే..!!
****
"సార్! టైమయింది. మీకు మహిళా మండలి వాళ్ళతో సమావేశం ఉంది." చెప్పాడు పియ్యే. "మహిళా మండలి అంటే ఏంది వయ్యా? నా చిప్పలో నీ రూపాయి.." ధర్మ సందేహం వ్యక్తం చేశాడు మంత్రి భిక్షపతి. "నగరం లోని ఆడవాళ్ళంతా కలిసి.." పియ్యే చెప్తుంటే మధ్యలో అడ్డుపడి "మా దాంట్ల గిట్ల, ఆడోల్లంత కలిసి ఉండే ఒక ఊనియన్ లెక్క. కలిసి అడుక్కుంటుండె! పైసల్ ఎయ్యకపోతె గిన మస్తు తిడుతుండె. గీల్లు కూడ గట్లనేనా? మైల మండలి అని పెద్ద పేరు పెట్టుకుండ్రు. ఎన్ని పైసల్ అడుగుతరో ఎందో.. ఒక్క రూపాయ్ గిన ఎయ్య నేను వాళ్ళకు.." చెప్పాడు భిక్షపతి.
"ఏం భాషరా బాబు. వీడు ఏ నక్క తోక తొక్కో మంత్రి అయ్యాడు. నక్క బదులు ఒక మొసలి తోక తొక్కితే పీడ పోయేది. పుష్కరాలకు వీన్ని మూసి నదిలో నిమజ్జనం చేయాలి." తిట్టుకుంటూ పియ్యే ఓటర్ల అమాయకత్వానికి బాధపడుతూ మంత్రిగారి వెంట బయల్దేరాడు.
సమయానికి ఒకటో రెండో నిమిషాలు లేటుగానే సభకు చేరుకున్నారు. మహిళా మండలి సమావేశం అంటే పదిరవై మంది ఉంటారనుకున్నాడు భిక్షపతి. కాని ఇక్కడ మునిసిపాలిటీ ట్యాప్ దగ్గర గుమికూడినట్టు జనాలు ఉండడంతో భిక్షపతికి భలే ఉత్సాహం వేసింది.. ఉత్సాహం కొంచెం ఎక్కువయ్యిందేమో, వెంటనే "పియ్యే, పియ్యే !!" అని పిలిచాడు. ఆ అరుపులు పియ్యే చెవిలో కుక్క అరుపుల్లా మ్రోగడంతో, వినయం గా "ఇక్కడే ఉన్నాను సార్!" అని చెప్పాడు.
"ఏమయ్యో పియ్యే!! ఇక్కడ ఉన్న ఈళ్ళంతా మైలా మండలోళ్ళేనా?" అడిగాడు భిక్షపతి.
"అవును సర్!" చెప్పాడు పి.ఎ.
"గట్లయితే! గీళ్ళను చూడంగనే మాంచి ఆలోచన వచ్చిందయ్యా!! ఈళ్ళకు చెరొక చిప్ప ఇస్తె మన దేశం ఎప్పుడో బాగుపడేది కదో? వెయ్యి కన్నా ఎక్కువే ఉన్నట్టున్నారు. సూత్తాంటే కన్నుల పండగలెక్క ఉందయ్యా!!" చెప్పాడు భిక్షపతి.
బళ్ళి మీద బాణామతి చేసే వెధవ, చెప్పులు చిన్నవయ్యాయని కాళ్ళు కోసుకున్నట్టుంది వీడి ఆలోచన. అని మనసులో అనుకుని.. "సార్! వాళ్ళంతా వి.ఐ.పి ల భార్యలు. వాళ్ళ గురించి అలా అనకూడదు. వింటే గొడవలవుతాయి." చెప్పాడు పి.ఎ. వినయం గా.. (నటిస్తూ)
కాసేపటికి మంత్రి గారి ఉపన్యాసం. ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. మంత్రిగారు చదువుకున్న పాపాన పోలేదు. అతనికి తెలిసిన గౌరవార్థకమయిన పదం " కాల్మొక్కుత బాంచను". తన ముప్పై ఏళ్ళ భిక్షా జీవితం తనకు నేర్పిన మంత్రం అదే! కాని, మంత్రి అయ్యాక మంత్రం మానక తప్పలేదు. దీన్ని బట్టి మంత్రిగారి విధ్యా నైపుణ్యం అర్థమయ్యే ఉంటుంది మీకు. ఇంక పి.ఏ. తనకు ఏం మాట్లాడాలో ముందే వంద సార్లు చెప్పినా అది గుర్తుండి చావదు. పోనీ స్క్రిప్టు రాసిద్దామన్నా ఘనుడి కి చదువు రాదు. పి.ఏ ప్రయత్నాలు ఏడారిలో చేపలు పట్టినట్టుంది. ఏమవుతుందో అని అనుమానంగానే ఉంది పి.ఎ. కు. ఎట్టకేలకు పది నిముషాలలోనే మంత్రిగారికి చెప్పుల దెబ్బలు పడ్డాయి. మనసూరుకోక ముందు పి.ఏ. తో చెప్పిన మాటలు స్టేజి మీద వాగేసాడు. తల మీద తెల్లగుడ్డేసుకుని తిరుగు ప్రయాణం పట్టారు మంత్రి, పి.ఏ.
ఇంక సి.ఎం. ను కలిసే పని ఉందని సి.ఎం దగ్గరికి బయల్దేరారు. భిక్షపతి అక్కడకు చేరుకునేసరికే సి.ఎం కు మహిలా మండలి విషయం తెలిసింది. భిక్షపతి అక్కడకు చేరుకోగానే స్వచ్చమయిన తెలుగులో ఒక పది భూతులు వడ్డించారు సి. ఎం. గారు. వేడి పెనం మీద పడ్డ బళ్ళిలా అయ్యింది భిక్శపతి పరిస్థితి. "ఛి! వెధవ రాజకీయాలు. గజ్జి పట్టునట్టుంది పరిస్థితి. దురదేసినా గోక్కోలేం. వీటికన్నా గుడి ముందు అడుక్కోవడమే బాగుండేది. అయినా, వ్రతం చెడ్డా ఫలం దక్కినట్టు సంపాదన బాగానే ఉంది కదా! ఒక పది నిమిషాలు నాలుగు గోడలమధ్య చెవులు మూసుకుని, ఇంకా తట్టుకోలేకపోతే బాత్ రూం కెళ్ళి ఏడిస్తే సరిపోద్ది." అనుకున్నాడు భిక్షపతి.